Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాకు కావాల్సింది న్యాయం, గౌరవం.. ఈ దారుణాలు ఆపండి: నటి స్నేహ

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై సినీ నటి స్నేహ మండిపడింది. మహిళలను దేవతలుగా కొలిచే ఈ దేశంలో... మహిళలపై ఇన్ని దారుణాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిర్భయ, నందినిలకు జరిగినట్టు ఇకపై ఏ ఇతర మహిళకు జరగకూడదని ఆమె తెలిపింది. సినీ నటులు భావన, వరలక్ష్మిలకు మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో ఆమె ఒక లేఖ రాసింది.

తమ పట్ల జరిగిన వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడిన వారిద్దరినీ ఎంతో అభినందిస్తున్నానని స్నేహ అంది. వారికి ఎదురైన అనుభవాలను తలచుకుంటేనే ఆవేదన కలుగుతోందని చెప్పింది. దేశాన్ని అమ్మగా పిలిచే మన రాజ్యంలో, జీవ నదులన్నింటికీ మహిళల పేర్లే పెట్టారని... దేవుడితో సమానంగా వీటిని పూజిస్తారని... ఇలాంటి దేశంలో మహిళలు హుందాగా, గౌరవంతో బతికే రోజులు పోయాయని లేఖలో పేర్కొంది. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం అని చెప్పింది.

మహిళలపై జరుగుతున్న దారుణాలపై పోరాడటానికి ఇదే సరైన సమయమని స్నేహ అభిప్రాయపడింది. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే చట్టాలను తీసుకురావాలని కోరింది. ఈ సందర్భంగా ఓ తల్లిగా తాను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నానని... మహిళలను గౌరవించేలా తన కుమారుడిని పెంచుతానని మాట ఇస్తున్నానని తెలిపింది.

More Telugu News